‘క్రాక్’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చేశారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఆయన రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే మరో సినిమాకు ఓకే చెప్పేశారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ 68వ సినిమా చేయనున్నారు.
అయితే, ఈ సినిమా ప్రకటన నేపథ్యంలో రవితేజ పారితోషికంపై ఇప్పుడు కొన్ని ఆసక్తికర వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం తన 68వ సినిమాకు రవితేజ రూ.16 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారని సమాచారం. అంతకుముందు ‘క్రాక్’ సినిమాకు గాను రవితేజ రెమ్యునరేషన్‌తో పాటు వైజాగ్ ఏరియా కలెక్షన్స్‌లో షేర్ కూడా తీసుకున్నారని సమాచారం. ఈ సినిమా రవితేజకు బాగా వర్కౌట్ అయ్యింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి.
ఇదిలావుంటే.. రవితేజ నటిస్తున్న 68వ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే కుమార్ బెజవాడ అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూర్తి కమర్షియల్ హంగులతో మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించనున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులును త్వరలోనే ప్రకటించనున్నారు.