టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సినిమాల్లో ‘చిత్రం’ ఒకటి. తేజని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ, ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అలాగే ఉదయకిరణ్, రీమాసేన్లకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు తేజ. తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (ఫిబ్రవరి 22న) తేజ ఈ సినిమాను ప్రకటించారు. ‘చిత్రం 1.1’ అనే టైటిల్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం నటీనటులందరినీ కొత్తవాళ్లను తీసుకున్నారు. మొత్తం 45 మంది కొత్త నటీనటులను తేజ ఈ చిత్రం ద్వారా పరిచయం చేయబోతున్నారు. అయితే, కేవలం నటీనటులు మాత్రమే కొత్తవాళ్లు.. టెక్నికల్ టీమ్ మాత్రం ఇంచుమించుగా పాతదే ఉండనుంది.
ఇక ‘చిత్రం’ సినిమాకు పనిచేసిన సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మళ్లీ చాలా కాలం తరవాత తేజతో జతకట్టారు. కాకపోతే, ‘చిత్రం’ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఈ చిత్రానికి పనిచేయడం లేదు. ఆయన స్థానంలో సమీర్ రెడ్డిని సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారు. అలాగే, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ఈ సినిమాను తేజ స్వయంగా నిర్మిస్తున్నారు. ఎస్.స్టూడియోస్ నిర్మాణ భాగస్వామి. ఇక యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.