ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో #NTR30 గురించి సినీ ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లుకొడుతోంది. అతి త్వరలో రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ సినిమాలో ‘ఉప్పెన’లో విలన్ గా మెప్పించిన కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో కూడా విలన్ గా అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఉప్పెన లో విజయ్ సేతుపతి నటన పట్ల ఎన్టీఆర్,త్రివిక్రమ్ ఫిదా అయ్యారని దీంతో ఆయనకి ఈ సినిమాలో ప్రతినాయకుని పాత్రను ఇచ్చారని నెట్టింట్లో చెప్పుకుంటున్నారు. కాగా, ఇటీవలే విడుదలైన ఉప్పెన విజయం సాధించడంలో విజయ్‌సేతుపతి కీ రోల్ పోషించాడు. కృతిశెట్టి తండ్రి రాయనం పాత్రలో విజయ్‌సేతుపతి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తాజా చిత్రంలోనూ విజయ్ సేతుపతికి అవకాశం దక్కింది. కానీ కాల్షీట్లు సర్ధుబాటు కాకపోవడంతో అతడు నటించడం లేదని తెలిసింది. ఇక ఎన్టీఆర్ సినిమాకి అతడు ఓకే చెప్పాడా లేదా? అన్నది చిత్రబృందం వెల్లడించాల్సి ఉంటుంది. ఓవైపు తమిళంలో కథానాయకుడిగా వరుసగా సినిమాలు చేస్తూనే టాలీవుడ్ ని సేతుపతి షేక్ చేస్తున్నాడు.