టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్లు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తను నటించి, నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించాడు. విష్ణు జోడీగా రుహీ సింగ్, అతడి సోదరిగా కాజల్ అగర్వాల్ నటించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. నవదీప్, సునీల్ శెట్టి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను 24ఫ్రేమ్స్ ఫాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిర్మిస్తున్నారు. మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే విడుదలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న చిత్ర ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ట్రైలర్ మూవీపై భారీ అంచనాలు పెంచుతుందని చిత్రయూనిట్ అంటున్నారు. భారత్‌లో మొదలై, అమెరికాను వణికించిన చరిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ‘మోసగాళ్ళు’ చిత్రం రూపొందుతోందని సమాచారం. కాగా, ఈ చిత్రానికి స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఈ సినిమా కథను ప్రారంభం నుంచి ముగింపు దాకా నరేట్ చేస్తారు వెంకటేశ్. ఈ సినిమాకి సంగీతం: శ్యామ్ సీఎస్, కెమెరా: షెల్డన్ చౌ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్.