నేచురల్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పండగ రోజు రానే వచ్చింది. నేడు (ఫిబ్రవరి 24) నేచురల్ స్టార్ నాని 37వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేచురల్ స్టార్ నాని పూర్తిపేరు గంటా నవీన్‌బాబు. గంటా రాంబాబు, విజయలక్ష్మీ దంపతులకు 1984 ఫిబ్రవరి 24న జన్మించిన నానికి.. బాల్యం నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. దీంతో డిగ్రీ లో ఉండగానే చదువు మధ్యలో వదిలేసి అవకాశాల కోసం దర్శకుల చుట్టూ తిరిగేవాడు. అలా బాపు డైరెక్ తెరకెక్కిన రాధాగోపాలం సినిమాకు క్లాప్ అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. తర్వాత రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల దగ్గర పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రేడియోజాకీలో పనిచేస్తున్న సమయంలో ఓ యాడ్ లో నాని నటనను చూసి దర్శకుడు ఇంద్రగంటి మోమన్‌కృష్ణ ‘అష్టాచమ్మా ’సినిమాలో అవకాశం ఇచ్చాడు. అలా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి సినీ హీరోగా ఎదిగాడు.
ఆ తర్వాత ‘రైడ్’, ‘స్నేహితుడా’, ‘భీమిలి కబడ్డీ’ జట్టు సినిమాల్లో నటించినా అవి పెద్దగా ఆడలేదు. 2011 లో నందినీరెడ్డి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ‘అలా మొదలైంది’ సినిమా..నాని కెరియర్‌కు బాగా ప్లస్ అయ్యింది. ఆ తర్వాత తమిళంలో వెప్పం అనే సినిమాలోనూ నటించాడు. ఇది తెలుగులో ‘సెగ’ పేరుతో రిలీజైంది. 2012లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమాలో నటించిన నాని తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. అదే ఏడాది గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నాని, సమంత నటించిన ఎటో వెళ్లిపోయింది సినిమాతో మరోసారి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత ‘పైసా’, ‘జెండాపై కపిరాజు’ సినిమాల్లో నటించినా అవి పెద్దగా ఆడలేదు. ఇక నానికి సక్సెస్ లేని సమయంలో 2015లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. అదే ఏడాది ‘భలేభలే మగాడివోయ్’ సినిమా విడుదలై నాని కెరియర్లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఆ తర్వాత 2017 వరకు కృష్ణగాడి వీరప్రేమగాధ, జెంటిల్మెన్, మజ్ను, నేను లోకల్, నిన్నుకోరి, ఎమ్‌సిఎ…ఇలా 2015 నుంచి వరుసగా 8 సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. 2018లో నాగార్జునతో కలిసి దేవదాసు సినిమాలో నటించాడు. అ అనే సినిమాతో నిర్మాతగానూ మంచి విజయం సాధించాడు. 2019లో గ్యాంగ్‌లీడర్, జెర్సీ సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక హీరోగా ఇప్పటికే 25 చిత్రాలు పూర్తి చేసుకున్నారు నాని. 26వ సినిమా ‘టక్ జగదీష్’ ఏప్రిల్‌లో రాబోతుంది. 27వ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రీకరణ జరుపుకుంటోంది. 28వ సినిమాగా ‘అంటే సుందరానికీ!’ ఖరారైంది. ఏడాదికి రెండు మూడు చిత్రాలు అందించేందుకు ఆసక్తి చూపుతుంటారు నాని. కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలు చవిచూసినా నిలదొక్కుకుని ‘నేచులర్ స్టార్’గా ఎదిగారు.