గోల్కొండ కోటపై త్వరలోనే బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు.సికింద్రాబాద్‌లోని రాజరాజేశ్వరీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర భాజపా మొదటి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బీజేపీకార్యకర్తలు చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్న సమయంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నలుగురు బీజేపీ కార్యకర్తలు కరోనాతో మరణించారని గుర్తుచేశారు.
కాగా..కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అవాస్తవాలను ప్రచారం చేశారని బండి సంజయ్ విమర్శించారు.. పారాసిట్మల్ టాబ్లెట్లు అంటూ అయోమయానికి గురి చేశారన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ను తెరాస.. పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తోందని ఆరోపించారు. ప్లెక్లీలపై ప్రధాని ఫొటో లేకపోవడం దారుణమన్నారు. సీఎం వైఖరి వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరగటం లేదన్నారు. హైదరాబాద్‌ను కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.