ఈ ఏడాది జూన్ లో బ్రిటన్ వేదికగా జరిగే జీ7 సదస్సుకు హాజరు కావాలని ఆ దేశ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించింది. బ్రిటన్ లో జరగబోయే ఈ జీ7 సమావేశాలకు భారత్, దక్షిణ కొరియా,ఆస్ట్రేలియాను బ్రిటన్ ప్రభుత్వం ఆహ్వానించింది. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితులు, సాంకేతిక మార్పులు,వాతావరణ మార్పు , వాణిజ్య ఒప్పందాలు వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, వివిధ సమస్యలపై నిర్ణయాలు తీసుకోడానికి జీ7 సదస్సు చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ ఓ ప్రకటనలో తెలిపారు.
కాగా..జనవరి 26, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కావాల్సి వుంది. అయితే కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ప్రకంపనలు కొనసాగుతుండటంతో భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. మహమ్మారి నివారణ చర్యలను పర్యవేక్షించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఆయన తన టూర్‌ను విరమించుకున్నారు.మరోవైపు బ్రిటన్ లో కరోనా కొత్త స్టెయిన్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలను ప్రజలు, ముఖ్యంగా యువత నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంగ్లండ్ తదితర నగరాల్లో విధించిన లాక్ డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు..