అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా ముద్ర వేయించుకున్న డొనాల్డ్ ట్రంప్ శకం ముగిసిపోయింది. మరికొద్ది గంటల్లో ఆయన అధ్యక్ష భవనాన్ని ధాన్ని వీడనున్నారు. కాగా,తన పదవి చివరి రోజున భారీ ఔదార్యం ప్రదర్శించారు. ఒకేసారి 73 మందికి ఆయన క్షమాభిక్ష ప్రసాదించారు. ట్రంప్ వద్ద పనిచేసిన మాజీ అడ్వైజర్ స్టీవ్ బానన్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో 46వ దేశాధ్యక్షుడిగా జోసెఫ్ బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వ చివరి రోజుల్లో ట్రంప్ మొత్తం 140 మందికి క్షమాభిక్ష పెట్టారు. ర్యాపర్ లిల్ వెయినీ, కొడాక్ బ్లాక్, డెట్రాయిట్ మేయర్ క్వామీ కిల్ప్యాట్రిక్లు కూడా ప్రాణభిక్ష పొందినవారిలో ఉన్నారు.
మరోవైపు అమెరికాలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్నా.. బ్రెజిల్ సహా పలు ఐరోపా దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. చైనా, ఇరాన్‌లపై ఆంక్షల్ని మాత్రం మార్చలేదు. కాగా.. ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ బృందం ఖండించింది. ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయని బైడెన్ పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్ సాకీ స్పష్టం చేశారు.