పశ్చిమబెంగాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఎంసీ, ప్రతిపక్ష భాజపా మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీలో చేరిన సువేందు అధికారి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా మమతను ఓడిస్తానని సువేందు అధికారి స్పష్టం చేశారు. సువేందు అధికారి సిట్టింగ్ స్థానమైన నందిగ్రామ్ (పుర్బో మేధినీపూర్) నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మమత ప్రకటించడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సువేందు అధికారిని అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపి మమతను ఓడించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ తనను నందిగ్రామ్‌లో అభ్యర్థిగా నిలిపితే మమతాబెనర్జీని కనీసం 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తా. లేదంటే రాజకీయాలను వదిలేస్తాను అని సువేందు స్పష్టం చేశారు.
కాగా మరికొన్ని నెలల్లో పశ్చిమబెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మాత్రం తృణమూల్‌కు భాజపా ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది. ప్రధానిగా మోదీ రెండో సారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో భాజపా బలం క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్లో తృణమూల్ కీలక నేత సువేందు అధికారితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. మరికొంత మంది కూడా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలను ఎదుర్కోవడం మమతా బెనర్జీకి అంతసులువేం కాదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Attachments area