దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల కొత్త పార్టీపై తెలంగాణలో ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు,తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి స్పందించారు.దీనిపై కోదండరాం మాట్లాడుతూ.. పక్క రాష్ట్రం వాళ్లు పార్టీ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ ఉండదని కోదండరాం స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలంగాణలో ప్రేమాభిమానాలు ఉన్న మాట వాస్తవమని, వైఎస్ఆర్పై ఉన్న సానుభూతి మాత్రమే పార్టీని నడపడానికి సరిపోవని ఆయన అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చటానికి ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని కోదండరాం వెల్లడించారు.
అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతచిన్నారెడ్డి స్పందిస్తూ..వైఎస్ కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నట్లు తెలిసిందని చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం కన్నా ఆమె ఏపీలోనే పార్టీ పెట్టుకోవడం మేలని చిన్నారెడ్డి అన్నారు. 2000 ఏడాదిలో తెలంగాణ రెండో దశ ఉద్యమం రాజశేఖర్ రెడ్డితో విభేదించి మొదలుపెట్టామని అన్నారు. తాము మొదలుపెట్టిన ఏడాదికి టీఆర్ఎస్ పార్టీ పెట్టి కేసీఆర్ ఉద్యమం ప్రారంభించారని గుర్తు చేశారు.అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ..వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్రెడ్డి భావిస్తున్నాడని వీహెచ్ అభిప్రాయపడ్డారు. షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశాడని ఆరోపించారు. షర్మిల ఒకవేళ పార్టీ పెట్టదలిస్తే ఏపీలోనే కొత్త పార్టీ పెట్టడం మేలని, తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని వీహెచ్ స్పష్టం చేశారు.