కేంద్ర ప్రభుత్వం చేసిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలుగా రాహుల్ పేర్కొన్నారు. “నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని మరోసారి నేను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నా..లేదంటే దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉంది ” అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చెప్పిన ఓ మాటని రాహుల్ ప్రజలతో పంచుకున్నారు. “సున్నితమైన మార్గంలో మీరు ప్రపంచాన్ని కదిలించవచ్చు” అనే వాక్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో రైతులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఐక్యరాజ్యసమితి స్పందించింది. శాంతియుత, అహింసా మార్గంలో చేపట్టే నిరసనలను గౌరవించాలని ఐరాస అభిప్రాయపడింది. ‘ఈ విషయంపై అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా.. శాంతియుత నిరసనలు, స్వేచ్ఛా సమావేశాలు, అహింసా మార్గాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని నేను భావిస్తున్నాను’ అని ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ అధికార ప్రతినిధి స్టీఫేన్ డుజారిక్ వెల్లడించారు.కాగా,ట్రాక్టర్ పరేడ్లో భాగంగా దిల్లీలో జరిగిన ఆందోళనల్లో దాదాపు 300మందికి పైగా పోలీసులు గాయపడగా, ఓ వ్యక్తి మరణించినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు.