ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా లాక్డౌన్ కారణంగా ఈ విద్యాసంవత్సరం కూడా ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020–21 విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 11 పేపర్ల నుంచి 7కి తగ్గించింది. విద్యా సంవత్సరం ఆలస్యం కావడం, స్కూళ్లలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ ఆలస్యం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా గతేడాది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించింది. పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించినా కరోనా విజృంభన కారణంగా పరీక్షలను రద్దు చేసి అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. కాగా,ఈ ఏడాది కూడా తరగతుల నిర్వహణ ఆలస్యం కావడంతో సిలబస్ తగ్గించి బోధిస్తున్నారు. బోధన పూర్తిస్థాయిలో జరగనందున గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పేపర్ల సంఖ్యను కుదించారు. భాషా పేపర్లతో పాటు సబ్జెక్టు పేపర్లను కలిపి 7కు కుదించారు. భాషా పేపర్లు, ఇతర సబ్జెక్టు పేపర్లను ఒక్కొక్కటి చొప్పున 5 ఉంటాయి. సైన్స్‌లో మాత్రం భౌతిక శాస్త్రం, వృక్ష శాస్తాలకు సంబంధించి వేర్వేరు పేపర్లు ఉంటాయి. మొత్తం 7 పేపర్లలో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుందని ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది.