కరోనా మహమ్మారిని అరికట్టేందుకు చేపట్టిన తొలి దశ టీకా కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగంగా సాగుతోంది. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన పదిహేను రోజుల్లోనే.. 37 లక్షల మందికిపైగా కరోనా టీకా అందచేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వరుసగా 10, 20, 30 లక్షల కొవిడ్ టీకాల లక్ష్యాలను, అతి తక్కువ సమయంలో చేరుకున్న దేశంగా భారత్ రికార్డు సాధించినట్లు ప్రకటించింది.
కాగా,ఇప్పటివరకు కరోనా టీకా తీసుకొన్న వారి సంఖ్య శనివారం రాత్రి ఏడు గంటలకు 37,01,157గా నమోదైనట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. పది లక్షల మార్కును అమెరికా 10 రోజుల్లోను, బ్రిటన్ 18 రోజుల్లో చేరుకోగా.. భారత్ ఈ ఘనతను కేవలం ఆరు రోజుల్లోనే సాధించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది అలాగే 20 లక్షలు, 30 లక్షల కొవిడ్ టీకాలను అతి వేగంగా అందచేసిన రికార్డు కూడా భారత్ సాధించినట్లు వెల్లడించింది.