తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కేటీఆర్? కేటీఆర్ త్వరలోనే సీఎం అవుతున్నారా ? సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇదే ఆసక్తికరమైన అంశంగా మారింది. సొంత పార్టీ నేతలు కూడా కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికి అన్నివిధాల సమర్థుడు అంటూ చెబుతున్నారు. తాజాగా కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం కూడా పెట్టేశారనే వార్తలు జోరందుకున్నాయి. దీంతో సొంత పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా సీఎంగా కేటీఆర్కు ఓటేస్తున్నారు.
అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ… వస్తున్న వార్తలపై తాజాగా సీఎం కేసీఆర్ స్పందించాడు. తెలంగాణ భవన్లో తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, సీఎంగా తానే కొనసాగుతానని వెల్లడించారు. ముఖ్యమంత్రి మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే ఈనెల 12 నుంచి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు చేయాలని సూచించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ అభ్యర్థిని ఎన్నిక రోజే ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను సీల్డ్ కవర్ ద్వారా ప్రకటిస్తామని.. తెలంగాణలో టీఆర్ఎస్కు ఎవరూ పోటీ లేరని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.