భారత్,చైనా సరిహద్దుల వద్ద మోహరించిన బలగాలను చైనా ఉపసంహరించుకున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు మోహరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.కాగా,తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు నుంచి చైనా, భారత్ బలగాల ఉపసంహరణ నేటి నుంచి ప్రారంభమైనట్టు రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి కల్నల్ యూ కియాన్ తెలిపారు. అయితే, ఈ అంశంపై భారత సైన్యం ఎలాంటి ప్రకటనా చేయలేదు. తొమ్మిదో రౌండ్ కమాండర్ స్థాయి చర్చల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకు చైనా, భారత సాయుధ దళాలు నేటి నుంచి ప్యాంగాంగ్ నుంచి వెనక్కి రావడం ప్రారంభించాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.కాగా, గతేడాది మే నెల నుంచి తూర్పు లద్దాఖ్‌లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు చైనాలో చిక్కుకుపోయిన నావికుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్కడ చిక్కుకుపోయిన 18మంది నావికులు ఈ నెల 14న భారత్‌కు తిరిగి చేరుకుంటారని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ రోజు జపాన్ నుంచి బయల్దేరిన వారంతా ఆదివారం స్వదేశానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను కలవబోతున్నారని తెలిపారు.కాగా, గతేడాది సెప్టెంబర్‌లో చైనాకు వెళ్లిన కార్గో నౌక ఎంవీ అనస్తాసియా 18మంది సిబ్బందితో చైనా తీరంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ నావికా సిబ్బంది జపాన్‌లో ఈరోజు బయల్దేరినట్టు కేంద్ర పోర్టుల శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ నావికులందరినీ భారత్‌కు తిరిగి పంపడంలో కృషిచేసిన చైనాలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని, ప్రయాణానికి ఏర్పాట్లు చేసిన మెడిటేరియన్ షిప్ కంపెనీని ప్రశంసించారు.