భారత దేశానికి చెందిన వాణిజ్యరంగ నిపుణురాలు ఉషారావు మొనారీని ‘ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం’ (యూఎన్డీపీ)లో అండర్ సెక్రటరీ జనరల్‌గా, సహాయ పరిపాలకురాలిగా నియమిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. కాగా, మౌలిక సదుపాయాల రంగంపై ఉషారావుకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బ్లాక్‌స్టోన్ గ్రూపులో ఆమె వివిధ హోదాల్లో సేవలు అందించారు.
మరోవైపు ఐక్యరాజ్య సమితిలో భారతీయ అమెరికన్ మహిళకు ఉన్నత పదవి దక్కింది. ఐరాస క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్(యూఎన్సీడీఎఫ్)లో అత్యున్నత హోదా అయిన కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇన్వెస్ట్మెంట్, డెవలప్మెంట్ బ్యాంకర్ ప్రీతి సిన్హా ఎంపికయ్యారు. తాజాగా ఆమె తన పదవిని చేపట్టారు. వెనుకబడిన వర్గాల్లో మహిళలు, యువతతోపాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ఆమె కృషి చేయనున్నారు. 1966లో న్యూయార్క్‌లో ఏర్పాటైన యూఎన్సీడీఎఫ్ అభివృద్ధిలో వెనకబడిన దేశాలకు సూక్ష్మ రుణాలను అందించడంలో సాయం చేస్తుంది.