శతకంతో చెలరేగిన లబుషేన్..తొలి రోజు ఆస్ట్రేలియా 274/5
బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా భారత్,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్..మార్కస్ లబుషేన్ 204 బంతుల్లో 9ఫోర్లతో 108 పరుగులు చేసి సెంచరీ బాదడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.ప్రస్తుతం క్రీజులో కామెరూన్ గ్రీన్ (28 పరుగులు),కెప్టెన్ టిమ్ పైన్ (38 పరుగులు) ఉన్నారు.ఈ ఇద్దరూ క్రీజ్‌కు అతుక్కుపోయారు. మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు.ఇక టీమిండియా బౌలర్లలో తొలి టెస్ట్ ఆడుతున్న నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా,మహ్మద్ సిరాజ్,శార్దూల్ ఠాకూర్,వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. డేవిడ్ వార్నర్, హారీస్‌లు స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. అయితే ఆ తర్వాత స్మిత్, లబుషేన్‌లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. వేడ్‌తో కలిసి కూడా లబుషేన్ భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. టీమిండియా తరపున ఈ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు అరంగేట్రం చేశారు. యార్కర్ కింగ్ నటరాజన్‌తో పాటు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడారు. మొత్తానికి తొలి రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరిచింది.ఇదిలావుండగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, ఆసీస్ 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్టును టీమిండియా ఓడిపోగా.. రెండో మ్యాచ్ గెలిచింది. మూడోది డ్రాగా ముగిసింది.