బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్(53*), శార్దూల్ ఠాకుర్(64*) నిలకడగా ఆడుతున్నారు. జట్టు స్కోర్ 186 వద్ద పంత్(23) ఆరో వికెట్‌గా వెనుదిరిగాక వీరిద్దరూ జాగ్రత్తగా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచిభాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 100 ఓవర్లకు టీమ్ఇండియా స్కోర్ 304/6గా నమోదైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 64 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇదిలావుండగా.. టీమిండియా యువ బౌలర్ శార్దూల్ ఠాకూర్..ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు. అతడు క్రీజులోకి వచ్చీ రాగానే కమిన్స్ వేసిన మూడో బంతినే సిక్సర్ గా బాదాడు. టెస్ట్ క్రికెట్లో అతను సాధించిన తొలి పరుగులు ఇవే కావడం విశేషం.. ఇలా సిక్స్‌తో టెస్ట్ క్రికెట్లో ఖాతా తెరిచిన రెండో భారత్ బ్యాట్స్‌మన్ గా శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు రిషబ్ పంత్ కూడా ఇలాగే సిక్స్‌తోనే తన పరుగుల ఖాతా తెరిచాడు. ఆ ఒక్క షాటే కాదు.. తర్వాత కూడా ఆసీస్ బౌలర్ల సమర్థంగా ఎదుర్కొంటూ అద్భుతమైన షాట్లతో భారత జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు శార్దూల్..