టీమిండియా నయావాల్ చెటేశ్వర్ పుజారా.. సోమవారం తన 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆట పట్ల అతడి నిబద్ధత, అంకితభావాన్ని ప్రశంసిస్తూ ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ‘‘ హ్యాపీ బర్త్‌డే పుజ్జీ.. నువ్వు ఎల్లప్పుడూ సౌఖ్యంగా, సంతోషంగా ఉండాలి. ఎన్నో గంటల పాటు క్రీజులో ఉండాలి. రాబోయే సంవత్సరం నీకు మరింత గొప్పగా ఉండాలి’’ అని శుభాకాంక్షలు తెలుపగా.. బీసీసీఐ సైతం పూజారాకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది.‘‘81 టెస్టులు, 6111 పరుగులు.. ఎదుర్కొన్న బంతులు 13572, 18 సెంచరీలు.. శరీరానికి ఎన్నో గాయాలవుతున్నా లెక్కచేయని..టీమిండియా నయా వాల్ పుజారాకి హ్యాపీ బర్త్‌డే’’ అని ట్వీట్ చేసింది.ఈ సందర్భంగా.. పుజారా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
►ఛతేశ్వర్ పుజారా 1988, జనవరి 25న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించాడు.
►అతడి పూర్తి పేరు ఛతేశ్వర్ అరవింద్ పుజారా. చే, పుజీ, పూజ్, స్టీవ్ అనే ముద్దుపేర్లు కూడా ఉన్నాయి
►పుజారా తండ్రి అరవింద్, అంకుల్ బిపిన్ సౌరాష్ట్ర తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడారు.
►పుజారా బీబీఏ చదువుకున్నాడు. చిన్ననాటి నుంచే క్రికెట్ పట్ల మక్కువ గల అతడు.. అండర్-19 కేటగిరీలో 2005లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు.
►2017లో రాంచీలో జరిగిన టెస్ట్‌లో పుజారా ఒక ఇన్నింగ్స్‌లో ఏకంగా 525 బంతులు ఆడి 202 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ ఒక ఇండియన్ బ్యాట్స్‌మన్ ఒక ఇన్నింగ్స్‌లో ఆడిన అత్యధిక బంతుల రికార్డు ఇదే.
►సౌతాఫ్రికా గడ్డపై రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన ఇండియన్ బ్యాట్స్‌మన్ పుజారానే. కపిల్ దేవ్ పేరిట 129 పరుగులతో ఉన్న రికార్డును చెరిపేస్తూ.. పుజారా 153 పరుగులు చేశాడు.
►టెస్టుల్లో ఇండియా తరఫున వేగంగా 1000 పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో ఉన్నాడు పుజారా. 2013లో హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పుజారా ఈ ఘనత సాధించాడు.