భారత క్రికెట్ జట్టు తరఫున వన్డే,టీ20 ఫార్మాట్ లోను ఆడాలనే కోరిక తనలో గట్టిగా ఉందని టీమిండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్, చతేశ్వర పుజారా అన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుజారా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ముగిసిన బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో పుజారా ఎంత కీలకమైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ సిరీస్‌కు తగిన ప్రాక్టీస్ లేకపోయినా పట్టుదలగా బ్యాటింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.నాకింకా టీమ్ఇండియా తరఫున వన్డే,టీ20ల్లో ఆడాలనే ఆశ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, అదే సమయంలో ఇతర ఆటగాళ్లు ఆడుతుంటే నాకా అవకాశం రాదు. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ముందు లాక్డౌన్లో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. అందువల్లే ఈ టోర్నీకి సన్నద్ధమవ్వడానికి ఇబ్బందులు పడ్డాను అని పేర్కొన్నాడు.
కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అందరికంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా పుజారా వరుసగా రెండోసారి రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటూ ఒళ్లు హూనం చేసుకున్నాడు. ముఖ్యంగా నిర్ణయాత్మక గబ్బా టెస్టులో, మ్యాచ్‌ను పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఒంటికి ఎన్ని గాయాలు అవుతున్నా తట్టుకుని నిలబడ్డాడు. ఆసీస్ బౌలర్లు కమిన్స్, హాజిల్‌వుడ్ వేసిన బంతులు వేగంగా దూసుకువస్తున్నా ఏకాగ్రతతో బ్యాటింగ్ కొనసాగించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.