కరోనా మహమ్మారి కారణంగా భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీ-2020-21 సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.అయితే రంజీ ట్రోఫీకి బదులు 50 ఓవర్ల విజయ్ హజారె ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కాగా,రంజీ ట్రోఫీని నిర్వహించకపోవడం 87 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ మేరకు సెక్రటరీ జై షా శుక్రవారం అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు లేఖ రాశారు. ఈ కరోనా మహమ్మారి అందరినీ పరీక్షించిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర సంఘాల మద్దతుతోనే పురుషుల దేశవాళి, అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఏప్రిల్, మే నెలలో ఐపీఎల్ 2021వ సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఫిబ్రవరిలోనే విజయ్ హజారె ట్రోఫీ జరిగే అవకాశం ఉంది. అందుకు సంబంధించి త్వరలోనే వేదికలను ప్రకటిస్తారు. ఈ ట్రోఫీ కోసం ఆరు బయో బుడగలను ఏర్పాటు చేస్తుండగా ఆటగాళ్లంతా మరో వారం రోజుల్లో అందులోకి అడుగుపెట్టనున్నారని సమాచారం.