ఐపీఎల్లో అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచిన టీమిండియా మాజీ కెప్టెన్,చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ.. టోర్నీ ద్వారా సంపాదనలో ఆగ్రస్థానంలో నిలిచాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోగా.. ఐపీఎల్ ద్వారా ధోనీ ఆదాయం రూ.150 కోట్ల మార్క్‌ని దాటింది. ఐపీఎల్ 2021 సీజన్ కోసం ధోనీకి రూ.15 కోట్లని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ చెల్లించనుంది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. తొలి సీజన్ వేలంలో రూ.6 కోట్లకి ధోనీని అప్పట్లో చెన్నై ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ధోని తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రూ.146.6 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత రూ.143 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.
కాగా,2008 ఐపీఎల్ సీజన్ ఆటగాళ్ల వేలంలో రూ.6 కోట్లకి ధోనీని కొనుగోలు చేసిన చెన్నై ఫ్రాంఛైజీ.. 2009, 2010 సీజన్లకీ అతడ్ని రిటైన్ చేసుకోవడం ద్వారా రూ.6 కోట్లు చొప్పున చెల్లించింది. 2011లో బీసీసీఐ ఫస్ట్ ఛాయిస్ రిటెన్షన్ ప్లేయర్ ధరని రూ.8 కోట్లకి పెంచింది. దాంతో 2011 నుంచి 13 వరకు రూ.8.25 కోట్లు ఆర్జించాడు. 2014లో మెగా వేలానికి ముందు బీసీసీఐ ఫస్ట్ ఛాయిస్ రిటెన్షన్ ప్లేయర్ ధరని రూ.12 కోట్లకి పెంచగా.. 2014, 2015 సీజన్లలో ధోనీకి రూ.12.5 కోట్లు చెన్నై చెల్లించింది.అయితే ఫిక్సింగ్ కారణంగా నిషేధం పడటంతో 2016, 2017 ఐపీఎల్ సీజన్లకి చెన్నై సూపర్ కింగ్స్ దూరమవగా.. ధోనీని దక్కించుకున్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఆ రెండు సీజన్లకి రూ.12.5 కోట్ల చొప్పున చెల్లించింది. మళ్లీ 2018లో ఐపీఎల్‌లోకి చెన్నై రీఎంట్రీ ఇవ్వగా.. అప్పటి నుంచి ధోనీని రూ.15 కోట్లు చొప్పున చెన్నై రిటైన్ చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో నాలుగు సీజన్లలోనే ( 2018, 2019, 2020, 2021) ధోనీ ఐపీఎల్ ఆర్జన రూ.60 కోట్లుగా ఉంది.ఇక మొత్తంగా..ఐపీఎల్ 14 సీజన్లకిగానూ ధోనీ రూ. 152 కోట్లు ఆర్జించాడు.