వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ జట్టు దూసుకెళ్లింది. కరోనా మహమ్మరి వ్యాప్తి కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా దూరం కావడంతో న్యూజిలాండ్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఐసీసీ ట్విటర్ వేదికగా తెలిపింది. లార్డ్స్ మైదానంలో జరగనున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత సాధించిందని వెల్లడించింది.వరల్డ్ ఛాంపియన్షిప్ పట్టికలో భారత్ 430 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా న్యూజిలాండ్ 420 పాయింట్లతో రెండు, ఆస్ట్రేలియా 332 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.
కాగా,భారత్, ఇంగ్లాండ్ జట్లు కూడా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఉన్నాయి. ఫిబ్రవరి 5నుంచి ఇరుజట్లు నాలుగు టెస్టుల సిరీస్‌లో పోటీపడనున్నాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఇంగ్లాండ్‌పై కనీసం రెండు టెస్టుల్లో గెలిచి మిగతా రెండు మ్యాచ్‌లలో ఓడిపోకుండా ఉంటే ఏ జట్టుతో సంబంధం లేకుండా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. అలాగే, భారత్‌పై ఇంగ్లాండ్ కనీసం మూడు టెస్టుల్లో గెలిస్తే ఫైనల్లోకి అడుగుపెడుతుంది.మరోవైపు ఆస్ట్రేలియాకు కూడా ఫైనల్ చేరేందుకు అవకాశాలు ఉన్నాయి.అయితే ఫైనల్ బెర్తు అవకాశాలపై ఇప్పుడు ఆసీస్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.