చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండు అరుదైన రికార్డులు సాధించాడు.కాగా..భారత్ లో బుమ్రా ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే అన్న విషయం ఇలా..స్వదేశంలో అరంగేట్రం చేసే ముందు విదేశాల్లో ఎక్కువ టెస్టులు ఆడిన ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. 2018లో దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ ఫార్మాట్ లో అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటి వరకూ 17 టెస్టులు ఆడాడు. ఇవన్నీ విదేశాల్లోనే కావడం గమనార్హం. కాగా..బుమ్రా కంటే ముందు వెస్టిండీస్ ఆటగాడు డారెన్ గంగా కూడా ఇలాగే విదేశాల్లో 17 టెస్టులు ఆడాడు. వీరి తర్వాత జవగళ్ శ్రీనాథ్ 12, ఆర్పీ సింగ్ 11 మ్యాచ్‌లు ఆడగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ విదేశాల్లో తొలుత 10 టెస్టులు ఆడాడు.
మరోవైపు ఇప్పటివరకు 17 టెస్టుల్లో బుమ్రా 79 వికెట్లు పడగొట్టాడు. సొంత గడ్డపై తొలి టెస్ట్ ఆడే ముందు ఇన్ని వికెట్లు తీసిన తొలి బౌలర్ బుమ్రానే కావడం విశేషం.అతని కంటే ముందు వెస్టిండీస్ స్పిన్నర్ ఆల్ఫ్ వాలెంటైన్ సొంతగడ్డపై తన తొలి మ్యాచ్‌కు ముందు 65 వికెట్లు తీసుకున్నాడు. ఇక స్వదేశంలో టెస్టుల్లో తాను వేసిన ఏడో ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ లారెన్స్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి బుమ్రా స్వదేశంలో తొలి వికెట్ పడగొట్టాడు.