టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ “ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డును గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ తన అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్ తన అద్భుత ఆటతీరుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.. సిడ్నీ టెస్టులో 97 పరుగులు చేసిన పంత్, బ్రిస్బేన్‌లో 89 పరుగులు చేశాడు. దాంతో టీమిండియా 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా..ఐసీపీ ప్రకటించిన తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు పంత్‌కు దక్కినందుకు పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును షబ్నిమ్ ఇస్మాయిల్ దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మహిళా క్రికెటర్‌కు జనవరి నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు లభించింది.
మరోవైపు రిషబ్ పంత్ తన గొప్ప మనస్సు చాటాడు. ఉత్తరాఖండ్ జలప్రళయం సందర్భంగా సహాయ చర్యల కోసం తన మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలనుకుంటున్నానని పంత్ ప్రకటించారు. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని జోషిమత్ వద్ద జరిగిన జలప్రళయంపై విచారం వ్యక్తం చేస్తూ పంత్ తాజాగా ట్వీట్ చేశారు.ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. జలప్రళయం బాధితులను ఆదుకునేందుకు మరింతమంది ముందుకు రావాలని కోరుకుంటున్నానని రిషబ్ పంత్ విజ్ఞప్తి చేశాడు.