ఐపీఎల్ 2021 సీజన్ లో గెలుపే లక్ష్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ఫ్రాంఛైజీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే వేలంలోకి క్రిస్ మోరీస్, అరోన్ ఫించ్, ఉమేశ్ యాదవ్, మొయిన్ అలీ, ఇసుర ఉదాన లాంటి సీనియర్ క్రికెటర్లని వదిలేసిన బెంగళూరు.. తాజాగా ఆ జట్టు కోచింగ్ స్టాఫ్‌లోకి టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ని బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘‘ఐపీఎల్ 14 సీజన్‌కు బ్యాటింగ్ సలహాదారుడిగా బెంగళూరు కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. ఘన స్వాగతం కోచ్..’’ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది.
కాగా..టీమిండియాకు బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగర్ అయిదేళ్లు పనిచేసిన సంగతి తెలిసిందే. 2014లో రవిశాస్త్రి టీమ్ డైరెక్టర్‌గా బాధ్యతలు అందుకున్న సమయంలో బంగర్ కూడా కోచ్‌గా చేరాడు. అయితే 2019 ప్రపంచకప్ అనంతరం అతడి స్థానంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాఠోడ్ వచ్చాడు. టీమిండియా తరఫున బంగర్ 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు.
ఇదిలావుండగా..ఐపీఎల్ 2020 సీజన్లో అతికష్టంగా ప్లేఆఫ్‌కి చేరిన ఆర్సీబీ.. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పేలవంగా ఓడిపోయి ఇంటిబాట పట్టింది. దాంతో.. మరోసారి ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగా ఆర్సీబీ నిలిచిపోగా.. ఐపీఎల్ 2021 సీజన్ వేలానికి ఏకంగా రూ. 35.7 కోట్ల పర్స్ వాల్యూతో బెంగళూరు ఫ్రాంఛైజీ వెళ్తోంది. చెన్నై వేదికగా ఈ నెల 18న ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల వేలం జరగనుంది. అలాగే ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించగా.. మార్చి 28 వరకూ ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. అనంతరం బెంగళూరు జట్టు క్యాంప్ నిర్వహిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఆర్సీబీ.. సంజయ్ బంగర్ పర్యవేక్షణలో ఆ క్యాంప్ ఉంటుందని తాజాగా వెల్లడించింది.