అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ ఓ స్థానం కోల్పోయి అయిదో ర్యాంకుకు పడిపోయాడు. చెన్నై వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో దుమ్మురేపిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ (883 పాయింట్లు) రెండు స్థానాలను మెరుగుపరచుకొని మూడో ర్యాంకును దక్కించుకున్నాడు. దాంతో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ (878 పాయింట్లు) కూడా ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకుకు పడిపోయాడు.
ఇక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (919 పాయింట్లు) తన అగ్ర స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. కాగా.. విలియమ్సన్, రూట్ మధ్య కేవలం 36 పాయింట్ల వ్యత్యాసం ఉంది. అలాగే రెండో స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్(891 పాయింట్లు)తో..రూట్ కన్నా 8 పాయింట్లు ముందంజలో ఉన్నాడు. ఇక పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్(760 పాయింట్లు)తో ఆరో స్థానంలో ఉండగా..బెన్‌స్టోక్స్(746 పాయింట్లు)తో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. టీమిండియా నయా వాల్ చెతేశ్వర్ పుజారా(754 పాయింట్లు)తో ఒక స్థానం కోల్పోయి ఏడో ర్యాంకుకు పడిపోయాడు.