భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని మరికొన్ని రోజుల్లో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ప్రారంభించబోతున్నాడు. ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ పేరుతో ప్రారంభంకానున్న ఈ అకాడమీలను ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ, బ్రెయినియాక్స్ బీ అనే సంస్థలు సంయుక్తంగా ప్రారంభించేందుకు శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాబోయే రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 15 అకాడమీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆర్కా స్పోర్ట్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, భారత మాజీ అండర్-19 ప్రపంచకప్ జట్టు సభ్యుడు మిహిర్ దివాకర్ వెల్లడించారు.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు తమ కెరీర్ ప్రారంభంలో వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాబోయే రెండేళ్లలో తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనీసం 20-25 శిక్షణా కేంద్రాలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దివాకర్ వెల్లడించారు. కాగా, ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ కోచింగ్ డైరెక్టర్గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారెల్ కలినన్ కొనసాగుతున్నారు. భారత్లో ఇప్పటికే 50కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విదేశాల్లో మూడింటిని ప్రారంభించారు.