చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఘోర పరాజయం దృష్ట్యా ఈ టెస్టులో కీలక మార్పులతో కోహ్లీసేన బరిలోకి దిగింది. తొలి సెషన్లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా డకౌట్లుగా వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. దానికి తోడు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా(21) కూడా తక్కువ పరుగులకే అవుట్ కావడంతో టీమిండియా 106 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.
ఇలాంటి సమయంలో ఓపెనర్ రోహిత్ శర్మ 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో (161) పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. అతడికి తోడు ఆజింక్య రహానే 149 బంతుల్లో 9 ఫోర్లతో (67) పరుగులు చేసి క్రీజులో నిలదొక్కుకోవడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. కాగా, భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా మొయిన్ అలీ వేసిన 22 ఓవర్ రెండో బంతికి కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. బంతిని కోహ్లి అంచనా వేసే లోపే అది గింగిరాలు తిరుగుతూ వికెట్లపైకి దూసుకుపోయింది. ఆ బంతికి కోహ్లీ సైతం షాక్‌కు గురయ్యాడు. అసలు బంతి వికెట్లను తాకిందా.. లేక కీపర్ చేతులు తగిలి వికెట్లపడ్డాయా అనే సందేహం విరాట్ ముఖంలో కనబడింది. కానీ అది క్లియర్ ఔట్ కావడంతో కోహ్లి పెవిలియన్ చేరక తప్పలేదు. అయితే మొయిన్ ఖాతాలో ఒక అరుదైన రికార్డు చేరింది. టెస్టుల్లో కోహ్లిని డకౌట్ చేసిన తొలి స్పిన్నర్‌గా మొయిన్ రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఇప్పటివరకూ కోహ్లి 11సార్లు డకౌట్ కాగా స్పిన్నర్‌కు డకౌట్ కావడం ఇదే తొలిసారి.