చెపాక్ మైదానం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. స్పిన్‌కు అనుకూలించే చెన్నై పిచ్‌పై భారత్ బౌలర్ల దెబ్బకి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ కుప్పకూలరు. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక ఇంగ్లాండ్ జట్టు 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. బెన్ ఫోక్స్ (42*) టాప్ స్కోరర్. భారత్ బౌలర్లలో అశ్విన్ (5/43) అయిదు వికెట్లతో అదరగొట్టాడు. ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. టీమిండియాకు 195 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
అంతకుముందు 300/6 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా 329 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ను ఓపెనర్ రోహిత్ (161) వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అతనికి తోడు రహానే (67), పంత్ (58 నాటౌట్) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగలిగింది. ఇదిలావుంటే..ఇంగ్లాండ్ బౌలర్లు తమ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క అదనపు పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో 67ఏళ్ల క్రితం భారత్ నెలకొల్పిన ఓ అరుదైన రికార్డును ఇంగ్లాండ్ తన పేరిట రాసుకుంది. 1954/55లో లాహోర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసి 328 పరుగులిచ్చింది. అందులో ఒక్క ఎక్స్ట్రా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అదే రికార్డును ఇంగ్లాండ్ బడ్డలుకొట్టింది.