నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలి రోజు టీమిండియా 300/6 స్కోర్‌తో పటిష్ట స్థితిలో నిలిచింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (161) పరుగులు, అజింక్యా రహానె(67) పరుగులు చేసి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో రిషభ్‌పంత్(33) పరుగులతో దూకుడుగా ఆడి జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. అయితే, శనివారం ఆట చివరి ఓవర్ సందర్భంగా పంత్‌తో ఇంగ్లాండ్ ఆటగాడు జోరూట్ మాటల యుద్ధానికి దిగాడు.
తొలి రోజు మొత్తం 88 ఓవర్ల ఆట సాగగా ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ 87వ ఓవర్ బౌలింగ్ చేశాడు. అయితే, పంత్ ఆ ఓవర్లో ఒక్కో బంతిని ఎదుర్కొనే సమయంలో కాస్త ఆలస్యం చేశాడు. దాంతో తొలిరోజు ఆటను ఆ ఓవర్‌తోనే ముగిస్తారని భావించాడు. కానీ, పంత్ అనుకున్నట్లు జరగలేదు. ఆట నిలిచిపోయే సమయానికి ఇంకా ఒక నిమిషం ముందే రూట్ తన ఓవర్‌ను పూర్తి చేశాడు. దీంతో ఇంకో ఓవర్ ఆట సాగాల్సి వచ్చింది. బంతి అందుకున్న ఓలీస్టోన్ చివరి ఓవర్‌ను పూర్తి చేశాడు. అయితే, ఓలీస్టోన్ 88వ ఓవర్ బౌలింగ్ వేయకముందు..పంత్, రూట్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తొలుత ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ ఏదో అనగా, పంత్ ఆ మాటలకు ధీటుగా జవాబిచ్చాడు. దీంతో పంత్, రూట్ మధ్య వాడీవేడీ సంభాషణలు చోటుచేసుకున్నాయి.