టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు. స్వదేశంలో 200 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగుల వద్ద రోహిత్ ఈ మైలురాయి అందుకున్నాడు. అంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని స్వదేశంలో 186 సిక్సర్లు కొట్టగా… టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 113 సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా ఇప్పటివరకు రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో 428 సిక్సర్లు బాది మూడో స్థానంలో ఉన్నాడు.
కాగా, రోహిత్ కంటే ముందు వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ అన్ని ఫార్మాట్లు కలిపి 534 సిక్సర్లతో తొలి స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక భారత్ నుంచి మహేంద్ర సింగ్ ధోని 359 సిక్స్‌లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇదిలావుండగా రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారీ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. 231 బంతులాడిన హిట్ మ్యాన్ 18 ఫోర్లు, 2 సిక్స్‌లతో 161 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టెస్టులో ఇంగ్లాండ్‌కి స్పిన్ కష్టాలు మొదలయ్యాయి. ఆటలో రెండో రోజైన ఆదివారం 300/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు.. 329 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లాండ్ టీమ్ 42 ఓవర్లు ముగిసేసరికి 88/6తో నిలిచింది. క్రీజులో బెన్ ఫోక్స్ (16 బ్యాటింగ్: 59 బంతుల్లో) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.