టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నమన్ ఓజా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల ఓజా భారత్ తరఫున మూడు ఫార్మాట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఒక టెస్టు, ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు. 2010లో జింబాబ్వే పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆ తర్వాత 2015లో శ్రీలంకతో కొలంబో వేదికగా టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే, మధ్యప్రదేశ్ దేశవాళీ క్రికెట్లో స్టార్ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్న ఓజా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 20 సీజన్ల పాటు ఆడినా కూడా తిరిగి జాతీయ జట్టులో స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు.
అయితే అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైనప్పటికీ.. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్లో ఓజా గొప్పగా రాణించాడు. కెరీర్లో 146 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఓజా.. 41.67 సగటుతో 9,753 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో ఓజా అత్యధిక స్కోరు 219 పరుగులు. అలానే 143 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 182 టీ20లను కెరీర్లో ఓజా ఆడాడు.
అలాగే ఓజా ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 2018 సీజన్లోనూ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున మ్యాచ్‌లాడిన నమన్ ఓజా.. పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోతూ వచ్చాడు. దేశవాళీ క్రికెట్లోనూ గత కొన్ని సీజన్లుగా తేలిపోతూ వచ్చిన ఈ ఓజా తాజాగా ఆటకి వీడ్కోలు పలికాడు.