టీమిండియా యువ ఆటగాడు అక్షర్ పటేల్ అరంగేట్రం టెస్టులోనే దుమ్మురేపాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్ 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టు పతనాన్ని శాసించాడు. దాంతో భారత్ నుంచి అరంగేట్రంలోనే 5 వికెట్లు పడగొట్టిన తొమ్మిదో బౌలర్ గా..ఆరో టీమిండియా స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. కాగా, అంతకుముందు భారత్ తరఫున అరంగేట్రంలో తొలిసారి 5 వికెట్ల ఘనత అందుకున్న బౌలర్ వీవీ కుమార్. 1960/61 సీజన్లో పాక్‌పై 5/64తో రాణించాడు. 1979/80లో ఆస్ట్రేలియాపై దిలీప్ దోషీ 6/103తో అదరగొట్టాడు. 1987/88లో వెస్టిండీస్‌పై హీర్వాణీ 8/61, 8/71తో చెలరేగాడు. ఇక 2008/09లో ఆస్ట్రేలియాపై అమిత్ మిశ్రా 5/71తో రాణించాడు. 2011/12లో వెస్టిండీస్‌పై రవిచంద్రన్ అశ్విన్ 6/47తో చెలరేగాడు. తాజాగా అక్షర్ పటేల్ 5/41తో ఇంగ్లాండ్‌పై అదరగొట్టడం విశేషం.
కాగా, అక్షర్ పటేల్ భారత్ తరపున 38 వన్డేల్లో 45 వికెట్లు, 11 టీ20ల్లో 9 వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో కోహ్లీసేన ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును 317 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచులో రోహిత్ శర్మ, అశ్విన్ సెంచరీలు చేయగా రిషభ్ పంత్, విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీలతో రాణించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన అక్షర్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. డొమిన్ సిబ్లీ, జాక్ లీచ్, జో రూట్, ఒలీ పాప్, ఒలీ స్టోన్‌ను ఔట్ చేశాడు.