ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో ఈ వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి వేలంలో బ్యాకప్ ఆటగాళ్లను కొనుగోలు చేస్తామని ఢిల్లీ క్యాపిటల్స్ సహాయ కోచ్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఏప్రిల్ లో జరిగే ఐపీఎల్ 14 కోసం తగిన బెంచ్ బలం పెంచుకోవడమే తమ లక్ష్యమని తెలిపాడు.
ఈ తరుణంలో కైఫ్ మాట్లాడుతూ..” ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట మేం కొంతమంది ఆటగాళ్లను విడుదల చేశాం. అందుకే ఆ లోటు పూడ్చుకోవాలని అనుకుంటున్నాం. వేలంలో టాలెంట్ కి ప్రాధాన్యం ఇస్తాం. వేలం ముందు చాలా ప్రణాళికలు ఉంటాయి. కానీ ఒక్కోసారి వేలం జరుగుతుండగానే ప్రణాళికలు మారిపోతుంటాయి. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మా కీలక ఆటగాళ్లు రెగ్యులర్ గా ఆడుతున్నారు. ఎలాంటి ఫిట్నెస్ ఇబ్బందులూ లేవు. అందుకే మేం రిజర్వ్ బెంచ్ బలంగా ఉంచుకొనేందుకు ప్రయత్నిస్తాం” అని కైఫ్ వివరించాడు.
కాగా, ఐపీఎల్ 2020 సీజన్లో అంచనాలకి మించి రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఫైనల్లో ఓడి కొద్దిలో టైటిల్ అవకాశాన్ని చేజార్చుకుంది. దాంతో.. ఐపీఎల్ 2021 సీజన్‌కి పెద్దగా మార్పులు లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 14 సీజన్ వేలం ముంగిట కేవలం ఆరుగురు ఆటగాళ్లని మాత్రమే రిలీజ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. 16 మందిని అట్టిపెట్టుకుంది. కాగా, రూ. 12.8 కోట్లతో ఐపీఎల్ 2021 సీజన్ వేలంలోకి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ వెళ్లబోతోంది.