ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలం చెన్నైలోని గ్రాండ్ ఛోలా హోటల్లో ప్రారంభమైంది. ఈ వేలం కోసం 1,114 మంది క్రికెటర్లు తమ పేర్లని రిజస్టర్ చేసుకోగా.. 292 మందితో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షార్ట్ లిస్ట్‌ని తయారు చేసింది. ఐపీఎల్ టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలు ఈ 292 మంది నుంచి 61 మంది ఆటగాళ్లని కొనుగోలు చేయనున్నారు. ఇందులో విదేశీ క్రికెటర్లు 22 మంది. మొత్తంగా ఈరోజు వేలంలో 196.6 కోట్లని అన్ని ఫ్రాంఛైజీలు ఖర్చు పెట్టనున్నాయి.
కాగా, ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ మళ్లీ దుమ్మురేపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.5 కోట్ల నుంచి చెన్నై, బెంగళూరు అతడిని దక్కించుకొనేందుకు విపరీతంగా పోటీపడ్డాయి. చెన్నై వద్ద తక్కువ మొత్తమే ఉండటంతో రూ.14 కోట్ల వరకు ప్రయత్నించి చివరకు వదిలేసింది.
గతేడాది డిసెంబర్ 2019లో జరిగిన ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను రూ.10 కోట్లు వెచ్చించి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమయ్యాడు. 2020 సీజన్లో 13 మ్యాచ్‌లాడిన ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ మొత్తంగా 108 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంజాబ్ ఫ్రాంఛైజీ అతడిని వదులుకోగా ప్రస్తుతం వేలంలోకి వచ్చాడు.