సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగే 5 టీ20 మ్యాచుల సిరీసుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా 19 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాతియా చోటు దక్కించుకున్నారు. మార్చి 12 నుంచి అహ్మదాబాద్ వేదికగా టీ20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్, యువ వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్ ఈ బృందంలో స్థానం సంపాదించారు. అలాగే, యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్ లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాహుల్ తెవాతియా కూడా ఈ బృందంలో చోటు దక్కించుకున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్, మనీశ్ పాండే జట్టులో చోటు కోల్పోగా.. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు.
టీ20 సిరీస్ లో ఇంగ్లీష్ జట్టుతో పోటీపడే భారత జట్టు ఇదే:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాతియా, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, నవదీప్ సైని