టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరో అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా ముగిసిన రెండు టెస్టుల్లో అద్భుతంగా రాణించిన అశ్విన్.. 17.82 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. కాగా, భారత్, ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం వేదికగా బుధవారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్టులో కనుక అశ్విన్ 6 వికెట్లు పడగొడితే.. ఓ అరుదైన జాబితాలో చోటు దక్కించుకోనున్నాడు.
అహ్మదాబాద్ లోని మొతెరా స్టేడియం వేదికగా జరిగే మూడో టెస్టులో అశ్విన్ మరో 6 వికెట్లు తీస్తే.. టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన నాలుగో భారత బౌలర్‌గా అరుదైన రికార్డు సాదించనున్నాడు. ఇప్పటి వరకూ భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత కపిల్ దేవ్ (434 వికెట్లు) రెండో స్థానంలో, హర్భజన్ సింగ్ (417 వికెట్లు) మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా, ఈ టెస్టులో కనుక అశ్విన్ 400 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగితే.. ఈ ఘనత సాధించిన మూడో భారత స్పిన్నర్‌గా అతను నిలవనున్నాడు.
ఇదిలావుంటే..2011లో భారత టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసిన అశ్విన్ ఇప్పటి వరకూ 76 టెస్టు మ్యాచ్‌లాడి 394 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 10 సార్లు 10 వికెట్ల మార్క్‌ని అందుకున్న అశ్విన్.. ఏకంగా 29 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు.