ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా అద్భుత శతకంతో సత్తాచాటాడు. లోకల్ టీ20 టోర్నీలో నిజ్వాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. సురేశ్ రైనా (104 నాటౌట్: 46 బంతుల్లో 11×4, 7×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో అతను ఆడుతున్న టైటాన్ జెడ్ఎక్స్ జట్టు 230 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్ లో ఆది నుంచే సురేశ్ రైనా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే అర్థ శతకం బాదిన సురేశ్ రైనా.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. దాంతో.. అతను ప్రాతినిథ్యం వహించిన టైటాన్ జెడ్ఎక్స్ టీమ్ ఘన విజయం సాధించింది. అంతకముందు బౌలింగ్ లో కూడా రైనా అదరగొట్టాడు ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రైనా.. 27 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
ఇక యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్‌కి వ్యక్తిగత కారణాలతో దూరమైన సురేశ్ రైనా.. ఐపీఎల్ 2021 సీజన్లో ఆడబోతున్నాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవల రైనాని రిటైన్ చేసుకుంది. కాగా, సురేశ్ రైనా ఐపీఎల్లో 193 మ్యాచ్‌లాడి 5368 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 5వేల పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా రైనా రికార్డులకెక్కాడు. ఆగస్టు 15, 2020న రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక 2005లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సురేశ్ రైనా.. 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లాడాడు.