అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగబోయే మిగిలిన రెండు టెస్టులూ టీమ్ఇండియాకు ఎంతో కీలకంగా మారాయి. కోహ్లీసేన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో తలపడాలంటే మిగిలిన రెండు టెస్టుల్లో.. ఒకటి గెలిచి, ఒక డ్రా చేసుకోవాలి. లేదా రెండూ గెలవాలి. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ లో జరగబోయే మిగతా మ్యాచ్‌లు చాలా కీలకంగా మారాయి. అయితే మూడో టెస్టులో ఓ సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ సిద్ధంగా ఉన్నాడు. అంత సవ్యంగా సాగితే.. వందో టెస్ట్ ఆడుతున్న రెండో టీమిండియా ఫాస్ట్ బౌలర్ గా, ప్రపంచవ్యాప్తంగా పదకొండో క్రికెటర్‌గా ఇషాంత్‌శర్మ రికార్డు సాదించనున్నాడు. అంతకుముందు భారత్ తరఫున ఈ ఘనతను సాదించిన ఏకైక బౌలర్ క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ కావడం విశేషం..
ఇక 2007 లో టెస్ట్ క్రికెట్లో చోటు సంపాదించుకున్న ఇశాంత్ శర్మ.. తన కెరీర్లో అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు భారత గడ్డపైనే ఆడటం విశేషం. స్వదేశంలో 39 టెస్టులు ఆడగా.. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధికంగా 13 టెస్టులు ఆడాడు. ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు 12 టెస్టుల్లో మాత్రమే బౌలింగ్ చేశాడు. వికెట్ల విషయానికొస్తే, ఇంగ్లండ్‌పై అత్యధికంగా 61 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాపై 59 వికెట్లు పడగొట్టాడు. ఒక ఏడాదిలో ఎక్కువ వికెట్ల పరంగా 2011, 2018లో అతడికి ఉత్తమమైనవిగా చెప్పుకోవచ్చు. 2011 లో 12 టెస్టుల్లో 43 వికెట్లు, 2018 లో 11 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు పడగొట్టాడు.