వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ నేతలతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం కొత్త చర్చకు దారితీసింది. తెలంగాణ వైసీపీ నేతలు, వైఎస్సార్ అభిమానులతో వైఎస్ షర్మిల సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు.. నేతలకు పిలుపులు అందడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదాల కారణంగానే ఆమె కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారని ఊహాగానాలు వినిపించినా.. ఆమె తెలంగాణలో పార్టీ దిశగా పావులు కదపడం సరికొత్త రాజకీయాలకు దారితీస్తోంది.
ఇదిలావుండగా..లోటస్ పాండ్‌లో వైఎస్సార్ అభిమానులతో భేటీ అయిన షర్మిల.. మీ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాలని భేటీకి హాజరైన నేతలను కోరారు. వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో ఉందన్న షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను అర్థం చేసుకోవాలని భావిస్తున్నాని షర్మిల తెలిపారు. షర్మిల పార్టీ ఏర్పాటు ఖాయమని తేలిన వేళ… మార్చి నెలలో పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజన్న రాజ్యం తెస్తానని ఆమె చెప్పడంతో.. వైఎస్ పేరు కలిసి వచ్చేలా పార్టీ పేరు ఉండనుందని తెలుస్తోంది. అంతే కాదు షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ (YSRTP) అని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాంతో వైఎస్ఆర్, తెలంగాణ ఈ రెండు పేర్లు వచ్చే విధంగానే పార్టీ పేరు నామకరణం చేశారని తెలుస్తోంది. కాగా, షర్మిల త్వరలోనే 100 నియోజకవర్గాల్లో 16 నెలలపాటు పాదయాత్ర నిర్వహిస్తారని కూడా తెలుస్తోంది.